న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం అవసరం
బార్ అసోసియేషన్ రిలే నిరాహార దీక్షకు ఎమ్మెల్యే చంటి సంఘీభావం… దాడులు, బెదిరింపులపై కఠిన చర్యలకు చట్టపరమైన రక్షణ ఉండాలి… అసెంబ్లీలో ప్రస్తావించి న్యాయశాఖ మంత్రితో చర్చిస్తానని హామీ…

ఏలూరు, అక్టోబరు 5: విధి నిర్వహణలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, బెదిరింపులను అరికట్టేందుకు ప్రత్యేక అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను తీసుకురావాల్సిన అవసరం ఉందని ఏలూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి పేర్కొన్నారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని కోరుతూ ఏలూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు సోమవారం ఆయన సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరంలో న్యాయవాదులతో కలిసి కూర్చొని వారి డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ న్యాయవాదులను బెదిరించడం, గాయపరచడం, వారి ఆస్తులకు నష్టం కలిగించడం వంటి ఘటనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రత్యేక చట్టపరమైన రక్షణ కల్పించాలన్నారు. న్యాయవాదులు స్వేచ్ఛగా, నిర్భయంగా విధులు నిర్వహించే పరిస్థితులు ఉండాలని పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అంశాన్ని ప్రస్తావిస్తానని, న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌తోనూ చర్చిస్తానని హామీ ఇచ్చారు. న్యాయవాదులు అధైర్యపడవద్దని, వారి న్యాయమైన డిమాండ్‌కు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటిని న్యాయవాదులు సన్మానించారు.

