దసరా రద్దీకి సాంకేతిక కట్టడి!
బూమ్ బ్యారియర్లతో వాహనాల రాకపోకల నియంత్రణ... యాక్సెస్ కంట్రోలర్లతో అనుమతి ఉన్నవారికే ప్రవేశం... డ్రోన్లు, అత్యాధునిక నిఘా వ్యవస్థలతో నిరంతర పర్యవేక్షణ...

విజయవాడ, అక్టోబర్ 12: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విజయవాడకు పోటెత్తుతున్న భక్తజన సందోహాన్ని నియంత్రించేందుకు నగర పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బూమ్ బ్యారియర్లు, యాక్సెస్ కంట్రోలర్లతో వాహనాలు, వ్యక్తుల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఈ వినూత్న విధానం రద్దీ నియంత్రణలో సత్ఫలితాలను ఇస్తోందని పోలీసు అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు జరుగుతున్న దసరా మహోత్సవాలతోపాటు విజయవాడ ఉత్సవ్ 2.0, పున్నమి ఘాట్‌లో జాతీయ సరస్ మేళా కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు, సందర్శకులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, భక్తుల రాకపోకలకు ఆటంకం కలగకుండా ప్రత్యేక భద్రతా ప్రణాళికను అమలు చేస్తున్నారు. అనుమతి ఉంటేనే ప్రవేశం ప్రధాన మార్గాలు, కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బూమ్ బ్యారియర్ల ద్వారా అధికారిక అనుమతి ఉన్న వాహనాలు, వ్యక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. యాక్సెస్ కంట్రోలర్ల సాయంతో అనధికారిక ప్రవేశాలను నియంత్రిస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలు క్రమబద్ధీకరించడంతోపాటు భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఏర్పడిందని పోలీసు శాఖ పేర్కొంది. 30 డ్యాష్బోర్డులతో నిరంతర నిఘా దసరా బందోబస్తులో భాగంగా డ్రోన్లు, వాహన నంబర్ ప్లేట్లను గుర్తించే ఏఎన్పీఆర్ వ్యవస్థతోపాటు దాదాపు 30 డ్యాష్బోర్డులతో కూడిన అత్యాధునిక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు. రద్దీ నియంత్రణలో సాంకేతిక వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారులు తెలిపారు. భక్తుల సహకారం అవసరం దసరా ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు భక్తులు పోలీసుల సూచనలు పాటించాలని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు కోరారు. ట్రాఫిక్ ఆంక్షలు, ప్రవేశ నియంత్రణ నిబంధనలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల భద్రత, సౌకర్యవంతమైన దర్శనమే లక్ష్యంగా పోలీసు శాఖ చర్యలు చేపట్టిందని తెలిపారు.

