11 నుంచి కరుమారి అమ్మన్ శక్తిపీఠంలో దసరా ఉత్సవాలు
20 వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు… రోజుకో అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనం… విజయదశమి రోజున అమ్మవారి ఊరేగింపు, శమీ పూజోత్సవం…

విజయవాడ, అక్టోబర్ 9: విజయవాడ పాలఫ్యాక్టరీ సమీపంలోని సీవీఆర్ ఫ్లైఓవర్ వద్ద ఉన్న శ్రీదేవి కరుమారి అమ్మన్ శక్తిపీఠంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు పీఠాధిపతి శ్రీ కరుణానందనాథ స్వామి తెలిపారు. శుక్రవారం శక్తిపీఠంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారు ప్రత్యేక అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. ఈ నెల 11న శైలపుత్రి, 12న బ్రహ్మచారిణి, 13న చంద్రఘంట, 14న కుష్మాండ, 15న స్కందమాత, 16న కాత్యాయని, 17న కాళరాత్రి, 18న మహాగౌరీ, 19న సర్వసిద్ధి, 20న మహామారి కరుమారి దేవి అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తారని వివరించారు. విజయదశమి సందర్భంగా 20వ తేదీ సాయంత్రం అమ్మవారి ఊరేగింపుతో పాటు శమీ పూజోత్సవంనిర్వహించనున్నట్లు తెలిపారు. 16 ఏళ్ల క్రితం శక్తిపీఠంలో అమ్మవారు స్వయంభూగా వెలిశారని, అప్పటి నుంచి ఏటా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ట్రస్ట్ కార్యదర్శి జ్ఞానేశ్వర్, ఆహ్వాన కమిటీ కార్యదర్శి కొరగంజి హేమంత్ కుమార్, మాతృమండలి అధ్యక్షురాలు బాలా త్రిపుర సుందరి తదితరులు పాల్గొన్నారు.

