మహిళా ప్రతిభకు వేదికగా ‘మిసెస్ విజయవాడ’
విజయవాడ ఉత్సవ్‌లో ఆకట్టుకున్న మహిళల కళా ప్రదర్శనలు… మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే కార్యక్రమాలు అభినందనీయం: కేశినేని జానకి లక్ష్మి… ప్రతి మహిళలోని ప్రత్యేక ప్రతిభను ప్రోత్సహించాలి: బొండా సుజాత…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబర్ 9: మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ‘మిసెస్ విజయవాడ’ వంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మి, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సతీమణి బొండా సుజాత అన్నారు. విజయవాడ ఉత్సవ్–2.0లో భాగంగా శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జిజ్ఞాస ఆర్ట్ వర్క్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మిసెస్ విజయవాడ’ పోటీలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జానకి లక్ష్మి మాట్లాడుతూ కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలు తమ కళాత్మక నైపుణ్యాలను ప్రదర్శించడం అభినందనీయమన్నారు. ఇలాంటి వేదికలు

మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. బొండా సుజాత మాట్లాడుతూ అందాల పోటీలు కేవలం బాహ్య సౌందర్యానికే పరిమితం కాకుండా మహిళల వ్యక్తిత్వం, సృజనాత్మకత, ప్రతిభను ప్రతిబింబించేలాఉండాలన్నారు. గృహిణులు, ఉపాధ్యాయినులు, వైద్యులు, ఐటీ ఉద్యోగులు, కళాకారులు ఒకే వేదికపై ప్రతిభ చాటడం స్ఫూర్తిదాయకమన్నారు. పోటీల్లో మహిళలు వివిధ రాష్ట్రాల సంప్రదాయ వస్త్రధారణతో పాటు నృత్యం, సంగీతం, మిమిక్రీ, వెంట్రిలోక్విజం, యాంకరింగ్, దుర్గాదేవి ఇతివృత్త ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. తొలిసారిగా ఇలాంటి పోటీల్లో పాల్గొనడం తమకు కొత్త అనుభూతినిచ్చిందని పలువురు మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.

