వానలోనూ వినాయకుడికి భక్తజన నీరాజనం
16వ డివిజన్‌లో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్ భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభం

విజయవాడ, సెప్టెంబర్ 24: నగరంలోని 16వ డివిజన్‌లో వినాయక చవితి ఉత్సవాలు గురువారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. స్కూబ్రిడ్జి వద్ద కే హోటల్ సమీపంలో నిర్వహించిన ఉత్సవాల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పాల్గొన్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ వినాయక చవితికి చారిత్రక ప్రాధాన్యం ఉందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో ప్రజలను ఒకచోటకు చేర్చి ఉద్యమ సమాచారాన్ని పంచుకునేందుకు ఈ ఉత్సవాలు వేదికగా నిలిచాయని గుర్తుచేశారు. వినాయకుడి అన్నప్రసాదాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారని తెలిపారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించడం వారి భక్తిశ్రద్ధలకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో గోగుల యేసు, గోగుల గోపి, రత్నం రమేష్, సింగంశెట్టి రమేష్, వేముల దుర్గారావు, గల్లా శ్రీను, మైలమూరు పీర్‌బాబు, పత్తి రామారావు, దేవుళ్ల శ్రీను, జానీ, కాళీ తదితరులు పాల్గొన్నారు.

