ప్రజలతో మమేకమవుతూ పైడి తులసి ఎన్నికల ప్రచారం
83వ డివిజన్లో ఇంటింటికీ వెళ్లి ఓట్ల అభ్యర్థన... స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న కూటమి అభ్యర్థి... అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యమంటూ సైకిల్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి...

పాయకాపురం, అక్టోబర్ 27 : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 83వ డివిజన్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి పైడి తులసి ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి డివిజన్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుసుకున్నారు. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పైడి తులసి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, స్థానిక సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

