గుడ్ సమారిటన్ చట్టంపై ప్రజల్లో అవగాహన పెరగాలి: ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం
ప్రమాద బాధితులకు సాయం చేసే వారికి చట్టపరమైన రక్షణ ఉందని స్పష్టీకరణ... గోల్డెన్ అవర్లో అందించే సహాయం ప్రాణాలను కాపాడగలదని సూచన... ప్రమాదం కనిపిస్తే 112కు సమాచారం ఇచ్చి, బాధితులను ఆసుపత్రికి తరలించాలని విజ్ఞప్తి...

విజయవాడ, ఆగస్టు 6 (వి10 టీవీ): రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ సహాయం చేయడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం అన్నారు. గుడ్ సమారిటన్ చట్టం ప్రకారం ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించే వారికి చట్టపరమైన రక్షణ ఉంటుందని, పోలీసులు లేదా ఇతర అధికారులు వారిని అనవసరంగా ఇబ్బంది పెట్టరని తెలిపారు. ప్రమాదం జరిగిన తొలి గంట అయిన గోల్డెన్ అవర్లో అందించే వైద్య సహాయం బాధితుల ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రమాదం కనిపించిన వెంటనే 112కు సమాచారం ఇవ్వడంతో పాటు, వీలైతే సమీప ఆసుపత్రికి తరలించాలని ప్రజలకు సూచించారు. గుడ్ సమారిటన్ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకుని, ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావాలని డీసీపీ షరీన్ బేగం పిలుపునిచ్చారు.

