చెత్త సేకరణకు విద్యుత్ ఆటోల ఊతం
కర్నూలుకు 91 ఆటోలు మంజూరు.. ఇప్పటికే వినియోగంలోకి 40… రూ.8 కోట్లతో సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ నిర్మాణం… మూడు నెలల్లో వందశాతం ఇంటింటి చెత్తసేకరణ లక్ష్యం: పట్టాభిరామ్…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
కర్నూలు, అక్టోబరు 6: విద్యుత్ ఆటోల రాకతో కర్నూలు నగరంలో ఇంటింటి చెత్తసేకరణ మెరుగుపడుతోందని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. చెత్తసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణలో 5.6 శాతం మెరుగుదల నమోదైందని తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి వెంకటరమణ కాలనీలో విశాల్ మార్ట్ వెనుక, జొహరాపురం రోడ్డులోని చెత్త బదిలీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ, పర్యావరణహితంగా చెత్తసేకరణ చేపట్టేందుకు కర్నూలుకు 91 విద్యుత్ ఆటోలు మంజూరు చేశామని చెప్పారు. ఇప్పటికే 40 ఆటోలు అందుబాటులోకి వచ్చాయని, మిగిలినవి ఈ నెలాఖరులోగా వస్తాయని తెలిపారు. నిర్ణీత మార్గాల్లో ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను సేకరిస్తున్నాయని వివరించారు. నగరంలో రోజుకు 225 టన్నుల చెత్త ఉత్పత్తవుతోందని, చెత్త నిర్వహణ కోసం బదిలీ కేంద్రాలను ఏర్పాటు చేయడంలో కమిషనర్ చొరవను అభినందించారు. గార్గేయపురం డంప్‌యార్డులో 9.5 ఎకరాల్లో రూ.8 కోట్ల వ్యయంతో సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఈ ప్లాంట్ ద్వారా రోజుకు 200

మెట్రిక్ టన్నుల చెత్తను శాస్త్రీయంగా శుద్ధి చేసి పునర్వినియోగానికి అనువుగా మారుస్తామని చెప్పారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ నిర్మాణం మరో ఏడాదిన్నరలో పూర్తవుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పంతో ఈ ప్రాజెక్టులు చేపడుతున్నామని, రాబోయే మూడు నెలల్లో వందశాతం ఇంటింటి చెత్తసేకరణ సాధించడమే లక్ష్యమని తెలిపారు. ప్రజలు ఇళ్ల వద్దే తడి చెత్తతో ఎరువు తయారు చేసుకోవాలని సూచించారు. అనంతరం జొహరాపురం డంప్‌యార్డులో పేరుకుపోయిన పాత చెత్తను వేరు చేసి తొలగించే బయోమైనింగ్ పనులను పరిశీలించారు. మిగిలిన 1.18 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తకు సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెత్త తొలగించిన స్థలాన్ని ప్రజా ప్రయోజనాలకు వినియోగించేలా స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలతో ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. విద్యుత్ ఆటోలను పరిశీలించి, ఒక వాహనాన్ని స్వయంగా నడిపారు. కార్యక్రమంలో ఎస్‌ఈ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, ప్రజారోగ్య విభాగం ఎంఈ గుర్రప్ప యాదవ్, నగరపాలక సంస్థ ఎంఈ గిరిరాజ్, డీఈఈ పవన్‌కుమార్‌రెడ్డి, ఏఈ వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.

