దళిత బహుజన పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా రత్నం
గన్నవరానికి చెందిన గోగులమూడి రత్నంకు బాధ్యతలు… విజయవాడలో జరిగిన రాష్ట్ర సమావేశంలో నియామకం… పార్టీ బలోపేతం, సామాజిక సమానత్వం కోసం కృషి చేస్తానని వెల్లడి…

విజయవాడ, అక్టోబర్ 18: దళిత బహుజన రాజకీయ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా గన్నవరానికి చెందిన గోగులమూడి రత్నం నియమితులయ్యారు. పార్టీ వ్యవస్థాపకుడు, సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూడి కృష్ణస్వరూప్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో జరిగిన రాష్ట్ర సమావేశంలో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ, రాష్ట్ర, వివిధ జిల్లాల నాయకులు రత్నంను అభినందించారు. రత్నం మాట్లాడుతూ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి, సంస్థాగత బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు పార్టీ అండతో ముందుంటానన్నారు. సామాజిక సమానత్వం సాధనకు అహర్నిశలు శ్రమిస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

