సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ సోదాలు
లెక్కల్లో చూపని రూ.2.48 లక్షల నగదు స్వాధీనం... సబ్‌రిజిస్ట్రార్ లక్ష్మీదేవిని విచారించిన ఏసీబీ అధికారులు... సోమవారం జరిగిన 42 రిజిస్ట్రేషన్లపైనా ఆరా...

తిరుపతి ఆగస్టు 18 (V10TV AP): తిరుపతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటల సమయంలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసులు సిబ్బందితో కార్యాలయానికి చేరుకుని సోదాలు చేపట్టారు. దీంతో కార్యాలయ సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లలో కలకలం రేగింది.
తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ.2.48 లక్షల నగదును గుర్తించిన అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన వివరాలపై సబ్‌రిజిస్ట్రార్ లక్ష్మీదేవిని విచారించారు. కార్యాలయంలోని రిజిస్ట్రేషన్ రికార్డులు, సంబంధిత దస్తావేజులు, నగదు లావాదేవీల వివరాలను పరిశీలించారు.
అవినీతికి సంబంధించి ఫిర్యాదులు రావడంతోనే తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. లెక్కల్లో చూపని రూ.2.48 లక్షలను స్వాధీనం చేసుకున్నామని, సోమవారం జరిగిన 42 రిజిస్ట్రేషన్లకు సంబంధించిన రికార్డులను కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు

