కళా ప్రతిభకు పట్టం.. జిజ్ఞాసకు నీరాజనం!
విజయవాడ ఉత్సవ్‌లో ఘనంగా ప్రారంభమైన సాంస్కృతిక పోటీలు… ఏడు విభాగాల్లో వందకు పైగా పోటీలు.. ఆరు వేల మందికి పైగా నమోదు… చిన్నారులు, యువతలో ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం : ఎమ్మెల్యే బొండా ఉమా…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబర్ 8: విజయవాడ ఉత్సవ్–2.0లో భాగంగా నగరంలోని కళా, సాంస్కృతిక ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న జిజ్ఞాస పోటీలు గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ సహకారంతో కేశినేని ఫౌండేషన్ ద్వారా జిజ్ఞాస సంస్థ ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఏడు విభాగాల్లో వందకు పైగా పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా, ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా ఆరు వేల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నారు. తొలి రోజే చిన్నారులు, యువత, కళాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కళలు, సంస్కృతికి విజయవాడ చిరునామాగా నిలుస్తోందన్నారు. చిన్నారులు, యువతలో దాగి ఉన్న ప్రతిభను

గుర్తించి వెలుగులోకి తీసుకురావడానికి జిజ్ఞాస పోటీలు చక్కటి అవకాశమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విజయవాడ ఉత్సవ్‌ను సొంత పండుగగా భావించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి జానకిలక్ష్మి మాట్లాడుతూ పోటీలకు ఆరు వేల మందికి పైగా నమోదు చేసుకోవడం ప్రజల్లో కళలు, సంస్కృతిపై ఉన్న ఆసక్తికి నిదర్శనమన్నారు. ప్రతిభావంతులను ప్రోత్సహించడమే జిజ్ఞాస ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, భవన నిర్మాణ కార్మికుల సలహా కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, సాంస్కృతిక కార్పొరేషన్ చైర్మన్ పొడపాటి తేజస్వి, పట్టాభి సతీమణి చందన, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ప్రతినిధులు, జిజ్ఞాస సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాకారులు పాల్గొన్నారు. పోటీదారుల సందడితో తుమ్మలపల్లి కళాక్షేత్రం కళకళలాడింది.

