సహాయ ఎస్సై షేక్ షంషుద్దీన్‌కు ఆత్మీయ వీడ్కోలు
మూడు దశాబ్దాలకు పైగా పోలీసుశాఖలో విశిష్ట సేవలు... శాలువాతో సత్కరించిన పరిపాలన విభాగం ఉప పోలీస్ కమిషనర్ సరిత... బాధితులకు న్యాయం చేసినప్పుడే పోలీసులకు నిజమైన ఆత్మసంతృప్తి...

విజయవాడ, సెప్టెంబర్ 30: ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘకాలం సేవలందించి బుధవారం పదవీ విరమణ పొందిన సహాయ ఎస్సై షేక్ షంషుద్దీన్‌కు పోలీస్ అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు కమిషనర్ కార్యాలయంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. చిత్తశుద్ధి, అంకితభావంతో పోలీసుశాఖ ద్వారా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించిన షంషుద్దీన్‌ను పరిపాలన విభాగం ఉప పోలీస్ కమిషనర్ కేజీవీ సరిత అభినందించారు. ఆయనను శాలువాతో సత్కరించి పోలీస్ మర్యాదలతో వీడ్కోలు పలికారు. షంషుద్దీన్ సిటీ శిక్షణ కేంద్రంలో సహాయ ఎస్సైగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ మూడు దశాబ్దాలకు పైగా ప్రజలకు రక్షణగా నిలిచే అవకాశం లభించడం దైవానుగ్రహమన్నారు. సమాజాన్ని దగ్గరగా పరిశీలిస్తూ ప్రజలకు నేరుగా సేవచేసే గొప్ప అవకాశం పోలీసుశాఖలో లభిస్తుందని చెప్పారు. బాధితులకు తక్షణ సహాయం అందించి న్యాయం చేసినప్పుడు పోలీసులకు కలిగే ఆత్మసంతృప్తి మరెక్కడా లభించదన్నారు. విధుల కారణంగా కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేని పరిస్థితులు ఎదురైనప్పటికీ జీవిత భాగస్వామి, పిల్లల సహకారం ఉంటే పోలీస్ జీవితం అద్భుతంగా సాగుతుందని పేర్కొన్నారు. షంషుద్దీన్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులను అభినందించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సహాయ పరిపాలన అధికారి మహమ్మద్ ఇలియాస్ అహ్మద్, సంక్షేమ రిజర్వు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమయ్య, కమిషనర్ కార్యాలయ పరిపాలన విభాగం సిబ్బంది, పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

