గుడివాడ విస్తరణకు తొలి అడుగు
పురపాలక సంఘంలో ఆరు గ్రామ పంచాయతీల విలీనంపై కీలక సమావేశం… రికార్డులు, ఆస్తులు, ఉద్యోగులు, బకాయిలపై సమగ్ర నివేదికకు ఆదేశం… విలీన గ్రామాలకు పట్టణ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడివాడ, అక్టోబర్ 3: గుడివాడ పురపాలక సంఘంలో ఆరు గ్రామ పంచాయతీల విలీన ప్రక్రియకు తొలి అడుగు పడింది. లింగవరం, వలివర్తిపాడు, మల్లయ్యపాలెం, బొమ్ములూరు, బిళ్లపాడు, భూషణగుళ్ల గ్రామాలను పురపాలక సంఘంలో విలీనం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో శనివారం కీలక సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ జి. బాలసుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో విలీన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. విలీనానికి సంబంధించిన న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయిన నేపథ్యంలో గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ఆర్డీఓ బాలసుబ్రమణ్యం అధికారులను ఆదేశించారు. ప్రతి పంచాయతీకి సంబంధించిన తీర్మానాలు, ఆస్తులు, రికార్డులు, ఉద్యోగులు, బకాయిలు, పెండింగ్ బిల్లులు, అభివృద్ధి పనుల వివరాలను లోటుపాట్లు లేకుండా సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. విలీన ప్రక్రియ పూర్తయిన అనంతరం ఆయా గ్రామాల పరిపాలన మున్సిపల్ కమిషనర్ పరిధిలోకి వస్తుందని తెలిపారు. ఉద్యోగుల విభజన, హోదాలు, బకాయిల విషయంలో అపోహలకు తావులేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే చర్యలు చేపడతామన్నారు. ప్రజలకు అందుతున్న రోజువారీ పౌర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. ఆయా పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది వివరాలతోపాటు ఆస్తులు, మౌలిక

వసతులు, ఆర్థిక లావాదేవీలు, పెండింగ్ పనులకు సంబంధించిన రికార్డులను సమగ్రంగా సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ ఆదేశించారు. భవిష్యత్తులో పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తకుండా ప్రతి వివరాన్నీ నమోదు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ విలీన ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను ఏ, బీ, సీ ప్రాధాన్యతలుగా విభజించి అంచనాలతో కూడిన సమగ్ర నివేదిక రూపొందించాలని చెప్పారు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి దశలవారీగా పనులు చేపడతామన్నారు. విలీన గ్రామాల్లో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు తదితర మౌలిక వసతులకు ప్రాధాన్యం కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గుడివాడ పట్టణ అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని విలీన గ్రామాలకు కూడా ఇస్తామని స్పష్టం చేశారు. ఈ విలీనం కేవలం పరిపాలనా మార్పు మాత్రమే కాదని, గ్రామాల ప్రజలకు మెరుగైన పౌర సేవలు, మౌలిక వసతులు అందించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సమావేశంలో గుడివాడ, పెదపారుపూడి మండలాల తహసీల్దార్లు ప్రసాద్, శ్రీను నాయక్, మండల అభివృద్ధి అధికారులు శ్రీనివాస్, మల్లీశ్వరి, గుడివాడ జనసేన ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్‌తోపాటు మున్సిపల్, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.
