‘అక్షరాంధ్ర’తో అక్షర విప్లవం..!
72.6 శాతం నుంచి 82.1 శాతానికి పెరిగిన రాష్ట్ర అక్షరాస్యత... ఏడాదిలోనే 25 లక్షల మందికి అక్షరజ్ఞానం... 2027 సెప్టెంబరు నాటికి 100 శాతం అక్షరాస్యతే లక్ష్యం: మంత్రి నారా లోకేష్...

అమరావతి, సెప్టెంబర్ 2: రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘అక్షరాంధ్ర’ కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. 2024లో 72.6 శాతంగా ఉన్న రాష్ట్ర అక్షరాస్యత ప్రస్తుతం 82.1 శాతానికి చేరిందని అధికారులు వెల్లడించారు. గత ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాలతో సుమారు 25 లక్షల మంది అక్షరాస్యులుగా మారినట్లు తెలిపారు.
పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాశాఖలపై నిర్వహించిన సమీక్షలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ 2027 సెప్టెంబరు నాటికి రాష్ట్రంలో నూరు శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఆదేశించారు. 2027 మార్చి నాటికి మరో 25 లక్షల మందిని, సెప్టెంబరు నాటికి మిగిలిన 27 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించినట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమాన్ని 11 ప్రభుత్వ శాఖల సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో బడి బయట ఉన్న పిల్లలందరినీ తిరిగి విద్యావ్యవస్థలోకి తీసుకురావాలని లోకేష్ సూచించారు. ప్రస్తుతం 1,64,821 మంది బడి బయట పిల్లలు ఉన్నట్లు గుర్తించగా, వారిలో సుమారు 33 వేల మందిని ఈ ఏడాది పాఠశాలల్లో చేర్పించినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల హాజరు 85.41 శాతంగా, ఉపాధ్యాయుల హాజరు 98.97 శాతంగా నమోదైనట్లు వెల్లడించారు. విద్యార్థి వరుసగా మూడు రోజులు పాఠశాలకు గైర్హాజరైతే తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ చేయాలని మంత్రి సూచించారు.
విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తూ విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలని, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక అకడమిక్ సహాయం అందించాలని మంత్రి అధికారులకు సూచించారు. అక్షరాస్యత పెంపుతో పాటు ప్రతి బడి ఈడు పిల్లవాడిని పాఠశాలకు తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.

