బస్సులో రూ.3 లక్షలు.. భద్రంగా తిరిగిచ్చిన కండక్టర్
ప్రయాణికుడు మరిచిపోయిన నగదుతో ఉన్న బ్యాగ్ గుర్తింపు... డ్రైవర్‌తో కలిసి భద్రపరిచి యజమానికి అప్పగింత... కండక్టర్ సరితను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్...

షాద్‌నగర్: ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు మరిచిపోయిన రూ.3 లక్షల నగదును భద్రంగా తిరిగి అప్పగించి కండక్టర్ సరిత తన నిజాయితీని చాటుకున్నారు. ఆమెతో పాటు డ్రైవర్ నరసింహులు చూపిన బాధ్యతాయుత ప్రవర్తన ప్రశంసలు అందుకుంది.
షాద్‌నగర్‌కు చెందిన వ్యాపారవేత్త జహంగీర్ తన భార్యతో కలిసి హజ్ యాత్రకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. అఫ్జల్‌గంజ్ వద్ద బస్సు దిగిన అనంతరం నాంపల్లికి వెళ్లిన జహంగీర్, కొద్దిసేపటి తర్వాత రూ.3 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను బస్సులోనే మరిచిపోయినట్లు గుర్తించారు.
ఇదే సమయంలో బస్సులో ప్రయాణికులు దిగిన తర్వాత తనిఖీ చేస్తున్న కండక్టర్ సరితకు నగదు ఉన్న బ్యాగ్ కనిపించింది. వెంటనే ఆమె డ్రైవర్ నరసింహులుకు సమాచారం ఇచ్చారు. ఇద్దరూ బ్యాగ్‌ను భద్రపరిచి, దాని యజమాని తిరిగి వస్తారని వేచి చూశారు.
నగదు పోయిందని ఆందోళనకు గురైన జహంగీర్ హుటాహుటిన తిరిగి బస్టాండ్‌కు చేరుకున్నారు. వివరాలు నిర్ధారించుకున్న అనంతరం కండక్టర్ సరిత, డ్రైవర్ నరసింహులు రూ.3 లక్షల మొత్తాన్ని అతనికి యథాతథంగా అప్పగించారు.
పోయిందనుకున్న సొమ్ము తిరిగి చేతికి చేరడంతో జహంగీర్ ఊపిరిపీల్చుకున్నారు. కండక్టర్, డ్రైవర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కండక్టర్ సరిత చూపిన నిజాయితీ, విధి నిబద్ధతను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఈ ఘటన ఆర్టీసీ ఉద్యోగుల బాధ్యతాయుత ప్రవర్తనకు, నిజాయితీకి నిదర్శనంగా నిలిచింది.

