అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ దిశగా మరో అడుగు
16 వరకు స్వీకరణ.. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల్లో అవకాశం... దరఖాస్తుల పరిశీలనకు దశలవారీ గడువులు... అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రతే లక్ష్యం...

అమరావతి, సెప్టెంబరు 7: వివిధ కారణాలతో అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు పింఛను పొందలేకపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అర్హులైన వారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. నిర్దేశిత దరఖాస్తు ఫారాలు ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. అవసరమైన పత్రాలతో దరఖాస్తును సమర్పించిన అనంతరం ఆన్లైన్లో నమోదు చేసి, వ్యవస్థ ద్వారా రూపొందించిన రసీదును దరఖాస్తుదారుడికి అందజేస్తారు.
దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం స్పష్టమైన షెడ్యూల్ను నిర్ణయించింది. సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ నమోదు, ఈ-కేవైసీ పరిశీలన చేపడతారు. సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు ప్రాథమిక అర్హత పరిశీలన జరుగుతుంది. 22 నుంచి 24 వరకు భౌతిక, శాఖాపరమైన ధృవీకరణతో పాటు అర్హత నిర్ధారణ, సిఫార్సులు చేపడతారు. సెప్టెంబర్ 25, 26 తేదీల్లో సెర్ప్ ద్వారా బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోద ప్రక్రియ పూర్తి చేయనున్నారు. అన్ని దశల పరిశీలన అనంతరం అర్హులైన వారికి దశలవారీగా పింఛన్లు మంజూరు చేయనున్నారు.
కావాల్సిన పత్రాలు
సాధారణంగా ఆధార్ కార్డు, బియ్యం కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రంతో పాటు సంబంధిత కేటగిరీకి అవసరమైన ధృవపత్రాలు సమర్పించాలి.
వృద్ధాప్య పింఛనుకు వయస్సు నిర్ధారణ కోసం ఆధార్ అవసరం. వితంతు పింఛనుకు భర్త మరణ ధృవీకరణ పత్రం, భర్త ఆధార్ నంబర్ సమర్పించాలి. ఒంటరి మహిళల్లో వివాహితులైతే విడాకుల ఉత్తర్వు లేదా కోర్టు డిక్రీ, అవివాహితులైతే తహశీల్దార్ జారీ చేసిన అవివాహిత ధృవీకరణ పత్రం అవసరం.
వికలాంగులు సదరం ధృవపత్రంతో 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యాన్ని నిర్ధారించాలి. చేనేత కార్మికులు చేనేత, జౌళి శాఖ ధృవపత్రం, మత్స్యకారులు మత్స్యశాఖ ధృవపత్రం, డప్పు కళాకారులు, సంప్రదాయ పాదరక్షల తయారీదారులు సాంఘిక సంక్షేమ శాఖ ధృవపత్రం సమర్పించాలి. కల్లుగీత కార్మికులు ఎక్సైజ్ శాఖ ధృవపత్రం, ట్రాన్స్జెండర్ లబ్ధిదారులు జిల్లా మెడికల్ బోర్డు జారీ చేసిన ధృవపత్రం సమర్పించాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో 61.92 లక్షల మంది లబ్ధిదారులు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 61,92,396 మంది సామాజిక భద్రతా పింఛన్లు పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. ఇందుకు నెలకు సుమారు రూ.2,694 కోట్లు వ్యయం అవుతోంది. రాష్ట్ర జనాభాలో దాదాపు 12.88 శాతం మంది పింఛన్ల ద్వారా లబ్ధి పొందుతున్నట్లు పేర్కొంది.
ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4 వేల చొప్పున, వికలాంగులకు రూ.6 వేల చొప్పున పింఛను అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడే కొన్ని వర్గాలకు రూ.10 వేల వరకు, పూర్తి స్థాయి వైకల్యం ఉన్న వారికి గరిష్ఠంగా రూ.15 వేల వరకు పింఛను అందిస్తున్నట్లు పేర్కొంది.
సీనియర్ సిటిజన్లు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, సంప్రదాయ పాదరక్షల తయారీదారులు, ట్రాన్స్జెండర్లు తదితర దాదాపు 28 కేటగిరీలకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు అందిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

