ప్రజాసేవకు వేదికగా బీజేపీ కార్యాలయం
కులమతాలకు అతీతంగా సేవలందించాలి... ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం... కార్యకర్తలు సేవాభావంతో ప్రజల మధ్య ఉండాలి: ఎమ్మెల్యే సుజనా చౌదరి...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
నందిగామ, సెప్టెంబరు 6 : భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ కార్యాలయాలు వేదికలుగా నిలవాలని మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) పిలుపునిచ్చారు. నందిగామ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రజలకు సేవలందించడమే నాయకులు, కార్యకర్తల లక్ష్యం కావాలన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా వచ్చేలా నూతన కార్యాలయం సేవా కేంద్రంగా మారాలని సూచించారు. నాయకులు కార్యాలయాలకే పరిమితం కాకుండా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.
బీజేపీ రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ 1984 లోక్సభ ఎన్నికల్లో రెండు స్థానాలతో మొదలైన పార్టీ ప్రయాణం 2019 ఎన్నికల్లో 303 స్థానాలకు చేరుకుందని చెప్పారు. పార్టీ ఎదుగుదల వెనుక లక్షలాది మంది కార్యకర్తల కృషి ఉందన్నారు. ప్రతి కార్యకర్త సేవాగుణంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి తనవంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

నందిగామలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమిష్టి సహకారంతో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విద్య, వైద్యం తదితర రంగాల్లో అవసరమైన వారికి సుజనా ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కోట్లాది మంది సభ్యులతో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ప్రతి గ్రామం, వార్డు స్థాయి వరకు పార్టీ కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నం గిరిధర్, పోరుగంటి నరసింహారావు, కొల్లు నాగేశ్వరరావు, బర్రె శివకృష్ణారెడ్డి, సీతారామయ్య, రావూరి రమేష్, బండారు వెంకట నాగ కేదారేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.

