దుర్గగుడిపై కొండచరియలు కలకలం
ఘటనపై తక్షణమే స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం భక్తుల భద్రతలో రాజీ లేదని అధికారులకు స్పష్టీకరణ శాస్త్రీయ పరిశీలనకు బెంగళూరు నుంచి రాక్ మెకానిక్స్ నిపుణులు

విజయవాడ, సెప్టెంబర్ 25: ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తక్షణమే స్పందించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన భక్తులు, ఆలయ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సత్యకుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, దుర్గగుడి కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌తో మంత్రి ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కొండచరియల పరిస్థితితోపాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన రక్షణ చర్యలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు బెంగళూరులోని జాతీయ రాతి యాంత్రిక శాస్త్ర సంస్థ నిపుణులను తక్షణమే పిలిపించాలని ఆదేశించారు. నిపుణులతో ఘటనాస్థలాన్ని పరిశీలింపజేసి సాంకేతిక నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. గతంలోనూ నిపుణులు ఇంద్రకీలాద్రి కొండ ప్రాంతాన్ని పరిశీలించి పలు భద్రతా సూచనలు చేశారని మంత్రి తెలిపారు. తాజా ఘటన నేపథ్యంలో గత సూచనల అమలు స్థితిని పరిశీలించడంతోపాటు అవసరమైన పటిష్ట చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నిపుణుల నివేదిక ఆధారంగా శాశ్వత రక్షణ చర్యలు చేపడతామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.

