ప్రేమ వివాదం.. నడిరోడ్డుపై స్టూడెంట్స్ గ్యాంగ్ వార్!
రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో పరస్పర దాడులు... చంద్రంపాలెం పాఠశాలలో మొదలైన వివాదం.. శివశక్తి నగర్‌లో ఘర్షణగా మారిన వైనం... 17 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘటనలపై ఆరు కేసులు నమోదు...

విశాఖ: విశాఖలో విద్యార్థులు, యువకుల మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపింది. తిమ్మాపురం రోడ్డులోని శివశక్తి నగర్‌లో రెండు రోజుల క్రితం రెండు వర్గాలుగా విడిపోయిన యువకులు నడిరోడ్డుపై పరస్పరం దాడులకు దిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వివాదమే ఈ ఘర్షణకు కారణమైనట్లు సమాచారం.
చంద్రంపాలెం పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య మొదలైన వివాదం క్రమంగా పెద్దదైందని తెలుస్తోంది. ఇరువైపులా యువకులు రెండు వర్గాలుగా ఏర్పడి కర్రలతో పరస్పరం దాడులకు దిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పాల్గొన్న వారిలో పలువురు మద్యం సేవించి ఉన్నట్లు కూడా సమాచారం.
ఘర్షణ జరుగుతున్న సమయంలో అటుగా వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనం టైరు యువకులకు తగలడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో బైక్‌పై ఉన్న వారితోనూ వాగ్వాదానికి దిగి వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
గురువారం రాత్రి మరోసారి కొందరు ఘర్షణకు ప్రయత్నించగా పోలీసులు అక్కడికి చేరుకోవడంతో వారు పరారైనట్లు సమాచారం. అనంతరం పోలీసులు చర్యలు చేపట్టి ఈ ఘటనలతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న మొత్తం 20 మందిలో 17 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వివిధ ఘటనలకు సంబంధించి ఆరు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. కేసుల్లో మేజర్లు, మైనర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు దారితీసిన కారణాలు, ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

