జూడాల సమ్మెతో గణనీయంగా తగ్గిన ఓపీ!
విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలపై సమ్మె ప్రభావం... రోజుకు 600 మంది వచ్చే ఓపీ.. 200 నుంచి 300 మందికే పరిమితం... స్పెషాలిటీ, డెంటల్ సేవలు సైతం 20 శాతం మేర తగ్గినట్లు సమాచారం...

విజయవాడ: జూనియర్ డాక్టర్ల సమ్మె ప్రభావం విజయవాడలోని కొత్త ప్రభుత్వాసుపత్రి వైద్య సేవలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నెల 17 నుంచి జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొంటుండటంతో ఆసుపత్రికి వచ్చే ఓపీ రోగుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది.
సాధారణ రోజుల్లో కొత్త ప్రభుత్వాసుపత్రికి దాదాపు 600 మంది రోగులు వివిధ ఆరోగ్య సమస్యలతో ఓపీ సేవల కోసం వస్తుంటారు. జూడాల సమ్మె నేపథ్యంలో ప్రస్తుతం ఆ సంఖ్య 200 నుంచి 300 మంది వరకు మాత్రమే ఉంటున్నట్లు సమాచారం. దీంతో ఓపీతో పాటు పలు విభాగాల్లో వైద్య సేవలపై ప్రభావం కనిపిస్తోంది.
సమ్మె కారణంగా స్పెషాలిటీ సేవలు, డెంటల్ విభాగానికి వచ్చే రోగుల సంఖ్య కూడా సుమారు 20 శాతం మేర తగ్గినట్లు తెలుస్తోంది. జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగితే ఆసుపత్రిలో సాధారణ వైద్య సేవలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

