నివేదిత గురుకులంలో ఉచిత వైద్య శిబిరం
సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు వైద్య పరీక్షలు… దంత, కంటి, సాధారణ, స్త్రీ సంబంధిత ఆరోగ్య పరీక్షలు… 120 మంది విద్యార్థినులకు చికిత్సలు… ఉచితంగా మందుల పంపిణీ…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గన్నవరం, అక్టోబర్ 5: గన్నవరం మండలం ఉంగుటూరులోని నివేదిత గురుకులంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థినుల కోసం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శ్రీ జయరామ విజ్ఞాన విహార యాజమాన్యం విజ్ఞప్తి మేరకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరంలో దంత, కంటి, సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. హెల్ప్ హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ రాగ నేతృత్వంలోని వైద్య బృందం విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంది. అవసరమైన వైద్య

పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించింది. బాలికలు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని, వారు సూచించిన జాగ్రత్తలను పాటించాలని సుజనా ఫౌండేషన్ సిబ్బంది సూచించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన శిబిరంలో 120 మంది విద్యార్థినులకు నిపుణులైన వైద్యులు ప్రత్యేక శ్రద్ధతో చికిత్సలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సిద్ధార్థ దంత వైద్యశాలకు చెందిన డాక్టర్ అజయ్ బెనర్జీ బృందం, శంకర నేత్ర చికిత్సాలయం వైద్యులు, సుజనా ఫౌండేషన్ సిబ్బంది శిబిరంలో సేవలు అందించారు.

