అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్–ఏఐ యూనివర్సిటీ
రాజధానిలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం.. రూ.730 కోట్లతో 8.5 ఎకరాల్లో యూనివర్సిటీ నిర్మాణం... సెప్టెంబర్ 13 నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తాత్కాలిక తరగతులు...

అమరావతి, ఆగస్టు 28: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థకు వేదిక కానుంది. దేశంలోనే తొలి క్వాంటమ్–ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) ఆధ్వర్యంలో, కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడైంది. సుమారు రూ.730 కోట్ల వ్యయంతో 8.5 ఎకరాల్లో క్యాంపస్‌ను నిర్మించనున్నట్లు సమాచారం.
క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల్లో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి ఈ సంస్థ ప్రాధాన్యం ఇవ్వనుంది.
శాశ్వత క్యాంపస్ నిర్మాణం పూర్తయ్యే వరకు సెప్టెంబర్ 13 నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభించనున్నట్లు సమాచారం.

