భవానీలకు లడ్డూ ప్రసాదం కొరత లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు
బుధవారం ఉదయం 11 గంటల వరకు 3,59,860 లడ్డూల విక్రయం… ప్రసాదాల తయారీని నిరంతరం కొనసాగిస్తున్న ఆలయ అధికారులు… నాణ్యత, శుచి, శుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం: ఈవో శీనా నాయక్…

విజయవాడ, అక్టోబర్ 21: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి తరలివస్తున్న భవానీ భక్తులకు లడ్డూ ప్రసాదాల కొరత తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డూ ప్రసాదాల తయారీని వేగవంతం చేశామని, ప్రతి భక్తుడికి అవసరమైన ప్రసాదాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. బుధవారం ఉదయం 11 గంటల వరకు మొత్తం 3,59,860 లడ్డూలను విక్రయించినట్లు ఈవో తెలిపారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రసాదాల తయారీ నిరంతరాయంగా కొనసాగుతోందన్నారు. తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించడంతో పాటు శుచి, శుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. అమ్మవారి లడ్డూ ప్రసాదాల నాణ్యత పట్ల భవానీ భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి. ప్రసాదాలు రుచికరంగా ఉన్నాయని, తమకు అవసరమైన మేరకు అందిస్తున్నారని పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ఆలయ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

