డీఎస్సీపై దుష్ప్రచారం మానుకోవాలి
వైఎస్సార్సీపీ తీరును నిరసిస్తూ తెలుగు యువత ఆందోళన... అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పణ... డీఎస్సీపై అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్...

విజయవాడ, సెప్టెంబర్ 30: డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. చిట్టినగర్ 49వ డివిజన్లోని భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్ మాధవ మాట్లాడుతూ 16 వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ద్వారా వేలాది కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందన్నారు. పారదర్శకంగా కొనసాగుతున్న డీఎస్సీ ప్రక్రియపై రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం సరికాదన్నారు. ఉపాధ్యాయ అభ్యర్థులను అవమానించడం, కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం బాధాకరమని పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాలపై అభ్యంతరాలు ఉంటే ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌పై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం మానుకోవాలని కోరారు. అభ్యర్థులకు న్యాయం చేయడంతోపాటు విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విజయవాడ వ్యవసాయ మార్కెట్ యార్డు డైరెక్టర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులు, దళిత యువతకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. అంబేద్కర్ విదేశీ విద్య పథకం పేరు మార్చడాన్ని ప్రస్తావిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు తమ గత పాలనపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ప్రక్రియపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాన్ని విరమించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 49వ డివిజన్ అధ్యక్షుడు బడుగు వెంకన్న, మాత్రపు కోటి రామ్మూర్తి, పూజల శీను, పైల దుర్గారావు, గౌరీశంకర్ రెడ్డి, కొంచెం బాలకృష్ణ, పూర్ణ, ఆర్ మణికంఠ, బొల్లి లక్ష్మణరావు, గూడెల త్రినాథ్, సాయి నవీన్, కె మహేష్, దేవర కళ్యాణ్, సంఘం మధు, నాగోతి వెంకటేష్, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

