రౌడీషీట్ల జాబితాలో వైసీపీ నేతలు
మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసుల చర్య దేవినేని అవినాశ్, తలశిల రఘురాం సహా 51 మంది జాబితాలో రాజకీయ కక్షసాధింపేనంటూ వైసీపీ నేతల ఆరోపణ

విజయవాడ, సెప్టెంబర్ 23: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై 2021లో జరిగిన దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు 51 మంది వైసీపీ నాయకులపై రౌడీషీట్లు తెరవాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్‌బాబు ఆదేశించినట్లు సమాచారం. ఈ జాబితాలో ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైసీపీ నేత దేవినేని అవినాశ్‌తోపాటు పలువురు నాయకుల పేర్లు ఉన్నట్లు తెలిసింది. మెగా డీఎస్సీ వ్యవహారంపై ప్రశ్నిస్తున్నందుకే కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ ఆరోపించింది. రౌడీషీట్లు తెరవనున్నట్లు చెబుతున్న 51 మందిలో పలువురు ఈ నెల 21న విజయవాడలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నవారు ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

