వర్షంలోనూ తగ్గని ప్రచార జోరు!
84వ డివిజన్‌లో లబ్బా దుర్గకు మద్దతుగా బొండా ఉమా విస్తృత ప్రచారం... వంగవీటి రాధాకృష్ణ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారన్న ఎమ్మెల్యే ధీమా... సంక్షేమ పథకాలు, నగరాభివృద్ధే కూటమి ప్రధాన అజెండా అని వెల్లడి...

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కూటమి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం 84వ డివిజన్ ప్రజాశక్తి నగర్ నాలుగు స్తంభాల సెంటర్ నుంచి టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి లబ్బా దుర్గకు మద్దతుగా ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రచారంలో పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజలను కలుసుకుంటూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగర మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందుతారని బొండా ఉమా ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధికే ప్రాధాన్యం ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ గత 27 నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ద్దపీట వేస్తోందన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం, అన్న క్యాంటీన్లు వంటి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలుతో పాటు రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. విజయవాడలో మౌలిక సదుపాయాల మెరుగుదల, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సమన్వయంతో ప్రచారం నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.

