పశ్చిమంలో కూటమి ప్రచార జోరు!
35, 36, 37వ డివిజన్లలో మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ విస్తృత ప్రచారం... కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి... ప్రచారంలో బుద్ధా వెంకన్న, బొమ్మసాని సుబ్బారావు, బాడిత శంకర్ తదితరుల భాగస్వామ్యం...

విజయవాడ, అక్టోబర్ 23: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా శుక్రవారం 35, 36, 37వ డివిజన్లలో విస్తృత ప్రచారం నిర్వహించారు. కూటమి బలపరిచిన మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న, బొమ్మసాని సుబ్బారావు, జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్న నాయకులు కూటమి అభ్యర్థులకు ఓటు వేసి ఘన విజయం అందించాలని కోరారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని సూచించారు. ప్రతి ఓటరును కలుసుకుని కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆయా డివిజన్ల కూటమి అభ్యర్థులు, జనసేన వీరమహిళలు, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

