వామపక్షాల నిరసనలకు పోలీసుల అనుమతి నిరాకరణ
శాంతిభద్రతల దృష్ట్యా నిరసనలకు అనుమతి లేదని స్పష్టీకరణ... నగరంలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని వెల్లడి... అనుమతి లేకుండా ధర్నాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక...

విజయవాడ, అక్టోబర్ 10: విజయవాడ నగరంలో శనివారం (అక్టోబర్ 10) వామపక్షాలు తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు అనుమతులు నిరాకరించినట్లు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ శుక్రవారం ప్రకటించింది. నగరంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 163, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున నిరసనలకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్ 2.0, సరస్ మేళా కార్యక్రమాల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో నిమగ్నమై ఉందని తెలిపింది. ప్రజలకు అసౌకర్యం, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరసన కార్యక్రమాలను విరమించుకోవాలని వామపక్షాలకు విజ్ఞప్తి చేసింది. అనుమతులు లేకుండా ధర్నాలు, నిరసనలు, చట్టవిరుద్ధ సమావేశాలు నిర్వహిస్తే సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనరేట్ హెచ్చరించింది.

