ఇంద్రకీలాద్రిపై అడుగడుగునా నిఘా
కొండచరియలు రిటైనింగ్ వాల్‌పై ప్రత్యేక పరిశీలన భక్తుల రక్షణే ప్రథమ ప్రాధాన్యమన్న ఈవో శీనా నాయక్ ప్రధాన స్టోర్స్‌ను అన్నదాన భవనానికి తరలించాలని ఆదేశం


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 24: భారీ వర్షాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి కొండపై విస్తృతంగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంతోపాటు చిన్న రాజగోపురం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం, నటరాజస్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఘాట్ రోడ్డులో కాలినడకన పర్యటిస్తూ ఓం టర్నింగ్ వద్ద కొండచరియలు జారిపడే అవకాశమున్న ప్రాంతాలు, రిటైనింగ్ వాల్, నడక మార్గాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కొండపై నుంచి మట్టి, రాళ్లు జారిపడే అవకాశమున్న ప్రాంతాలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. గతంలో కొండచరియలు జారిన ప్రాంతాలతోపాటు ఓం టర్నింగ్ వద్ద ఏర్పాటు చేసిన ఇనుప రక్షణ వలలు, రక్షణ గోడలను ఇంజినీరింగ్ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలించాలని

ఆదేశించారు. రాళ్లు, వర్షపు నీరు ఘాట్ రోడ్డుపైకి రాకుండా అత్యవసర సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ఘాట్ రోడ్డులో జరుగుతున్న మరమ్మతు పనుల పురోగతిని సమీక్షించిన ఈవో వర్షపు నీరు నిలవకుండా డ్రైనేజీల ద్వారా వేగంగా దిగువకు వెళ్లేలా చూడాలని సూచించారు. కనకదుర్గానగర్‌లోని డ్రైనేజీ అవుట్లెట్లను పరిశీలించి, పారిశుధ్య సిబ్బంది నిరంతరం పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశించారు. మహా మండపం ఆరో అంతస్తులో ఉన్న దేవస్థాన ప్రధాన స్టోర్స్ విభాగాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త అన్నదాన భవనం సెల్లార్లోకి తక్షణమే తరలించాలని ఆదేశించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో భక్తుల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఇంజినీరింగ్, పారిశుధ్య విభాగాలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పరిశీలనలో దేవస్థాన కార్యనిర్వాహక ఇంజినీర్ ఎల్.రమ, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

