చేతిపై పచ్చబొట్టు ఛేదించింది హత్య మిస్టరీ
మృతురాలు భవానీపురానికి చెందిన కళ్యాణిగా గుర్తింపు కుమారుడి విషయంలో విభేదాలే హత్యకు కారణమని పోలీసుల అనుమానం షఫిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఇబ్రహీంపట్నం పోలీసులు

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 26 (ఆంధ్రప్రభ): ఇబ్రహీంపట్నం కూలింగ్ కెనాల్‌లో ముక్కలుగా లభించిన మహిళ మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. మృతురాలిని భవానీపురానికి చెందిన కళ్యాణిగా పోలీసులు గుర్తించారు. ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంతో బంధువులు గుర్తించి పోలీసులను సంప్రదించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం కళ్యాణికి భవానీపురానికి చెందిన షఫితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. కొంతకాలం క్రితం తన కుమారుడిని షఫి వద్ద ఉంచిన కళ్యాణి తిరిగి కుమారుడిని అప్పగించాలని పదేపదే ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఈ విషయంలో ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తడంతో సుమారు పది రోజుల క్రితం కళ్యాణిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి కూలింగ్ కెనాల్‌లో పడేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు షఫిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ కేసును త్వరగా ఛేదించడంలో స్థానిక మీడియా సహకారం కీలకంగా నిలిచిందని ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. పూర్తి దర్యాప్తు అనంతరం హత్యకు గల కారణాలు, ఇతరుల ప్రమేయంపై స్పష్టత వస్తుందని పోలీసులు పేర్కొన్నారు.
