ఆటో కార్మికులకు త్వరలో సంక్షేమ బోర్డు
కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమమే లక్ష్యం… డీజిల్ ఆటోలను విద్యుత్ ఆటోలుగా మార్చేందుకు రూ.200 కోట్లు… ఒక్కో ఆటోకు రూ.1.50 లక్షల రాయితీ: మంత్రి పొన్నం ప్రభాకర్…

హైదరాబాద్: ఆటో కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం త్వరలో ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ అంశంపై శాసనసభలో చర్చించి, అవసరమైన నిధులను కేటాయిస్తామని తెలిపారు. ప్రస్తుతం పెంచిన ఆటో ఛార్జీలు సరిపోతాయా లేదా అనే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆటో కార్మికుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ‘రాజీవ్ యువ వికాసం’ పథకం కింద డీజిల్ ఆటోలను విద్యుత్ ఆటోలుగా మార్చేందుకు రూ.200 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకంలో భాగంగా ఒక్కో ఆటోకు రూ.1.50 లక్షల రాయితీ అందించనున్నట్లు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

