కానూరులో టపాసుల పేలుడు.. బాలుడి మృతి
పాత ఇనుప పెయింట్ డ్రమ్ములో టపాకాయ వేయడంతో ప్రమాదం… పేలుడు ధాటికి నాగదుర్గ త్రిలోక్ తలకు తీవ్ర గాయాలు… ఆసుపత్రికి తరలించినా దక్కని ప్రాణం.. తల్లిదండ్రులకు తీరని శోకం…

పెనమలూరు, అక్టోబర్ 17: సరదాగా టపాసులు కాలుస్తున్న వేళ జరిగిన ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కృష్ణా జిల్లా పెనమలూరు పరిధిలోని కానూరులో పాత ఇనుప పెయింట్ డ్రమ్ములో వేసిన టపాకాయ పేలడంతో నాగదుర్గ త్రిలోక్ అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అపార్ట్‌మెంట్ వద్ద చిన్నారులు టపాసులు కాలుస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. చిన్నారులు పాత ఇనుప పెయింట్ డ్రమ్ములో టపాకాయ వేయడంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి అక్కడే ఉన్న త్రిలోక్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లి వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కళ్లముందే కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారులతో సందడిగా ఉన్న అపార్ట్‌మెంట్ పరిసరాల్లో ఈ ఘటన విషాదం నింపింది.

