పెడన అభివృద్ధికి రూ.12 కోట్లు
హ్యామ్ పథకంలో మౌలిక వసతుల కల్పన వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు నాణ్యతతో గడువులోగా పనులు పూర్తిచేస్తాం: ఎమ్మెల్యే కాగిత


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
పెడన, సెప్టెంబర్ 22: పెడన పట్టణంలో రూ.12 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పథకంలో చేపట్టే ఈ పనులకు సంబంధించి పట్టణంలోని దేవాంగ కల్యాణ మండపంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పెడన పురపాలక సంఘం అభివృద్ధికి రూ.12 కోట్లు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. ఈ నిధులతో పట్టణంలోని రహదారులు, మురుగునీటి కాలువలు, పారిశుద్ధ్యం, రవాణా వ్యవస్థతోపాటు ఇతర మౌలిక వసతులను బలోపేతం చేస్తామని తెలిపారు. పెరుగుతున్న పట్టణ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన వసతులు, ఆధునిక

సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేయిస్తామని చెప్పారు. ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ప్రతి పనిని చేపడతామని, నాణ్యత విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ సహకారంతో పెడనను ప్రణాళికాబద్ధమైన ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కృష్ణాజిల్లా కలెక్టర్ జీకే బాలాజీ, ఆర్డీవో కె.సాంబశివరావు, పెడన నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి పంచికర్ల సురేష్, మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

