స్వచ్ఛథాన్ స్ఫూర్తితో విజయవాడ ఉత్సవ్
22 రాష్ట్రాల నుంచి స్వచ్ఛథాన్లో పాల్గొన్న పది వేల మందికిపైగా… ఈసారి ఐదు వేల మంది కళాకారులతో భారీ కార్నివాల్… విజయవాడ ఉత్సవ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక…

విజయవాడ, అక్టోబర్ 3: విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛథాన్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. స్వచ్ఛథాన్ స్ఫూర్తితో విజయవాడ ఉత్సవ్‌ను మరింత విభిన్నంగా, వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. శనివారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, భవన నిర్మాణ కార్మికుల సలహా కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ ఉద్యమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. శుక్రవారం నిర్వహించిన స్వచ్ఛ దివస్, స్వచ్ఛథాన్లో 22 రాష్ట్రాల నుంచి పది వేల మందికిపైగా పాల్గొన్నట్లు చెప్పారు. విజయవాడ ప్రజలు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛథాన్ విజయంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారని చెప్పారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులంతా సమన్వయంతో విజయవాడ ఉత్సవ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఉత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారని, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించేందుకు ఎంపీ వెళ్లినట్లు తెలిపారు. దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌ను లక్షలాది మంది సందర్శించి ఆనందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గతేడాది మూడు వేల మందితో నిర్వహించిన కార్నివాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, ఈసారి ఐదు వేల మంది కళాకారులతో మరింత భారీగా నిర్వహించనున్నట్లు పట్టాభిరామ్ వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతాల కళా బృందాలు ప్రదర్శనలు ఇవ్వనున్నాయని చెప్పారు. పున్నమి ఘాట్, మాకినేని బసవపున్నయ్య స్టేడియం, సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సరస్సు మేళాతోపాటు డ్రోన్, బాణసంచా, లేజర్ ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో యువత కోసం వివిధ పోటీలు నిర్వహిస్తామన్నారు. స్వచ్ఛథాన్ను విజయవంతం చేసినట్లుగానే విజయవాడ ఉత్సవ్‌ను కూడా ప్రజలు విజయవంతం చేయాలని పట్టాభిరామ్ కోరారు.

