పల్లె బాటకు రూ.4.17 కోట్ల కొత్త ఊపిరి
• గుడ్లవల్లేరు మండలంలో రోడ్ల అభివృద్ధికి శ్రీకారం... • పోలిమెట్ల–పెంజండ్రకు రూ.1.10 కోట్లు.. కౌతవరం–చేవెండ్రకు రూ.1.80 కోట్లు... • గాదెపూడి ఎం.ఎన్.కే రోడ్డుకు రూ.57 లక్షలు.. విన్నకోట, కట్టవాని చెరువులో ఇప్పటికే రూ.74 లక్షల పనులు...

గుడ్లవల్లేరు, ఆగస్టు 29: గుడ్లవల్లేరు మండలంలోని గ్రామీణ రహదారుల రూపురేఖలు మార్చే దిశగా రూ.4.17 కోట్ల సాస్కి నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శ్రీకారం చుట్టారు. కూటమి నాయకులతో కలిసి ఆయా గ్రామాల్లో రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.
విన్నకోట, కట్టవాని చెరువు గ్రామాల్లో ఇప్పటికే రూ.74 లక్షలతో పనులు ప్రారంభం కాగా, తాజాగా పోలిమెట్ల–పెంజండ్ర రహదారికి రూ.1.10 కోట్లు, కౌతవరం–చేవెండ్ర రహదారికి రూ.1.80 కోట్లు, గాదెపూడి ఎం.ఎన్.కే రహదారికి రూ.57 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు.
చాలాకాలంగా రోడ్లు అధ్వానంగా ఉండటంతో ఎదురవుతున్న ఇబ్బందులను గత పర్యటనల్లో గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చారని ఎమ్మెల్యే రాము తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్వహణ, అభివృద్ధి నిర్లక్ష్యానికి గురై రాష్ట్రవ్యాప్తంగా రహదారుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని రాము విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మారుమూల గ్రామాలకు సైతం మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ నిధులను వినియోగిస్తున్నామని తెలిపారు. మంచి రోడ్లతో గ్రామాల మధ్య రాకపోకలతో పాటు రైతుల పంటల రవాణా, విద్యార్థుల ప్రయాణం, అత్యవసర వైద్య సేవలకు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు.
గుడివాడ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడమే లక్ష్యమని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు.
కార్యక్రమాల్లో జనసేన గుడివాడ ఇన్చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డు చైర్మన్ పొట్లూరి రవి, మండల టీడీపీ అధ్యక్షుడు పోలవరపు వెంకటరావుతో పాటు కూటమి నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు

