ఎల్బీనగర్లో గంజాయి ముఠా గుట్టురట్టు
ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలింపు ముగ్గురు నిందితుల అరెస్ట్.. 6 కిలోల గంజాయి స్వాధీనం రూ.3,500కు కొనుగోలు.. రూ.14 వేలకు విక్రయం

హైదరాబాద్: ఎల్బీనగర్లో గంజాయి అక్రమ రవాణా ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఎల్బీనగర్ పోలీసులు, మాదకద్రవ్యాల నిరోధక విభాగం సంయుక్తంగా చేపట్టిన చర్యల్లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ రింగ్‌రోడ్డులోని సిల్వర్ ప్లేట్ హోటల్ సమీపంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సునీత నాగ్, పొజ్జ దర్దోలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన నాగర్‌కర్నూల్ జిల్లా వంగూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన మంచాల రాజేష్‌ను కూడా అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతానికి చెందిన లఖన్ వద్ద కిలో గంజాయిని రూ.3,500 చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలించినట్లు విచారణలో వెల్లడైంది. సుక్మా నుంచి భద్రాచలం చేరుకుని, అక్కడి నుంచి బస్సులో ఎల్బీనగర్కు వచ్చి గంజాయిని రిసీవర్‌కు అప్పగించే ప్రయత్నంలో పోలీసులకు చిక్కారు. హైదరాబాద్‌లో కిలో గంజాయిని రూ.14 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ రవాణా వెనుక మరెవరైనా ఉన్నారా? ఒడిశా నుంచి హైదరాబాద్ వరకు సరఫరా నెట్వర్క్ ఎలా పనిచేస్తోంది? మరెక్కడెక్కడ గంజాయి సరఫరా చేస్తున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

