కేకుల తయారీలో హానికర పదార్థాలు!
అమ్నామ్స్ గల్ఫ్ బేకర్స్‌పై ఉప్పల్ ఎస్‌ఓటీ దాడులు కాలం చెల్లిన పౌడర్లు, కృత్రిమ రంగులు స్వాధీనం ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు

మేడిపల్లి: కేకుల తయారీలో నిబంధనలకు విరుద్ధంగా హానికరమైన, కాలం చెల్లిన పదార్థాలను వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బేకరీపై ఉప్పల్ జోన్ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ రోడ్డు మల్లికార్జున్‌నగర్‌లో ఉన్న అమ్నామ్స్ గల్ఫ్ బేకర్స్‌లో సోమవారం తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో కేకుల తయారీకి వినియోగిస్తున్న అమోనియా పొడి, నిమ్మ పసుపు, నారింజ ఎరుపు తదితర కృత్రిమ ఆహార రంగులను గుర్తించినట్లు సమాచారం. కాలం చెల్లిన రమ్‌జామిక్ పొడితో పాటు వాటిని ఉపయోగించి తయారు చేసినట్లు అనుమానిస్తున్న కేకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. బేకరీలో పరిశుభ్రతా ప్రమాణాలు సరిగా పాటించడం లేదని అధికారులు గుర్తించినట్లు సమాచారం. బేకరీ నిర్వహిస్తున్న జార్ఖండ్‌కు చెందిన అబ్దుల్ ముత్తలిబ్ సయ్యద్‌ను ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పదార్థాలు, కేకులతో పాటు అతడిని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆహార పదార్థాల తయారీలో నిషేధిత లేదా గడువు ముగిసిన పదార్థాలు వినియోగిస్తున్నారా అనే అంశాన్ని సంబంధిత ఆహార భద్రతా అధికారులు కూడా పరిశీలించి, నమూనాలను పరీక్షించి వాస్తవాలను నిర్ధారించాల్సిన అవసరం ఉంది.
