దసరా ఉత్సవాలకు రావాలని సీఎంకు ఆహ్వానం
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానపత్రిక అందించిన దుర్గగుడి పాలక మండలి... అమ్మవారి ప్రసాదంతో వేదాశీర్వచనం చేసిన వేదపండితులు... భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశం...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 30: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఆహ్వానించారు. మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిసి ఉత్సవాల ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వేదపండితులు ముఖ్యమంత్రికి అమ్మవారి ప్రసాదాన్ని అందించి వేదాశీర్వచనం చేశారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున దర్శనం, క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, భద్రత విషయంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఇంద్రకీలాద్రి క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో దుర్గగుడి ధర్మకర్తల మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, కార్యనిర్వహణ అధికారి శీనా నాయక్, పాలక మండలి సభ్యులు ఉన్నారు.

