సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలకాలి
బొండా సిద్ధార్థ ఆధ్వర్యంలో ప్లకార్డులతో ప్రదర్శన... ఎన్టీఆర్ జిల్లాలో 25 వేల కుటుంబాలకు పట్టాల పంపిణీ... కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యువతకు పిలుపు...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 29: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఘన స్వాగతం పలికేందుకు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ ఆధ్వర్యంలో మంగళవారం సింగ్నగర్లో ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సింగ్నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా జీవో-30 కింద క్రమబద్ధీకరణ పట్టాలను పంపిణీ చేయనున్న నేపథ్యంలో స్వాగత కార్యక్రమానికి ఏర్పాట్లు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 25 వేల కుటుంబాలకు, సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు ఆరు వేల కుటుంబాలకు పట్టాలు అందనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.

సెంట్రల్ నియోజకవర్గంలో వేలాది కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందేలా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. పేదల ఇళ్లకు చట్టబద్ధమైన హక్కు కల్పించడం ద్వారా వారి ఆస్తులకు శాశ్వత భద్రత లభిస్తుందన్నారు. భవిష్యత్ తరాలకు కూడా ఈ ఆస్తి హక్కు ఉపయోగపడుతుందని చెప్పారు. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దాసరి ఉదయశ్రీ, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పైడి తులసి, మాజీ కార్పొరేటర్లు ఫిరియా జగదాంబ, ఎరుబోతు శ్రావణి, గౌసియా, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

