సురక్షిత సమాజ నిర్మాణంలో 'ఏపీ అస్త్రం' కీలక పాత్ర: డీసీపీ షిరీన్ బేగం
ప్రజల భద్రతే లక్ష్యంగా రూపొందించిన సమగ్ర మొబైల్ యాప్... అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసు సేవలు అందించే వేదిక... ప్రతి పౌరుడు మొబైల్లో తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవాలని సూచన...

విజయవాడ, ఆగస్టు 5 (వి10టీవీ):
రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో అందుబాటులోకి తీసుకొచ్చిన 'ఏపీ అస్త్రం' మొబైల్ యాప్‌ను ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని వినియోగించాలని విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన 'ఏపీ అస్త్రం' యాప్ ప్రజలకు మరింత వేగవంతమైన, సులభమైన పోలీసు సేవలను అందించాలనే లక్ష్యంతో రూపొందించబడిందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎస్ఓఎస్ ద్వారా వెంటనే పోలీసులను అప్రమత్తం చేయడంతో పాటు, ట్రాఫిక్ సమాచారం, రోడ్డు ప్రమాదాల వివరాలు, ఫిర్యాదుల నమోదు, ఇతర భద్రతా సేవలను ఒకే వేదికపై పొందే అవకాశం ఈ యాప్ ద్వారా కల్పించబడిందని తెలిపారు.
నేటి డిజిటల్ యుగంలో ప్రతి పౌరుడు సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, వాహనదారులు సహా ప్రతి ఒక్కరి మొబైల్లో 'ఏపీ అస్త్రం' యాప్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఈ యాప్ ద్వారా ప్రజలు పోలీసు శాఖతో మరింత వేగంగా అనుసంధానం కావచ్చని, అత్యవసర పరిస్థితుల్లో విలువైన సమయాన్ని ఆదా చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ప్రజల భాగస్వామ్యంతో స్మార్ట్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందరూ ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసి కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా తెలియజేసి వినియోగించేలా ప్రోత్సహించాలని ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం కోరారు.

