వీధికుక్కల దాడిలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు
రామానగరంలో కోటేశ్వరమ్మపై ఒక్కసారిగా దాడి… తీవ్ర గాయాలతో విషమంగా మారిన వృద్ధురాలి పరిస్థితి… 108లో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలింపు…

చల్లపల్లి, అక్టోబర్ 3: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలం రామానగరంలో వీధికుక్కలు ఓ వృద్ధురాలిపై దాడి చేశాయి. స్థానికంగా నివసిస్తున్న కోటేశ్వరమ్మ (70)పై కుక్కలు ఒక్కసారిగా దాడిచేయడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే కుక్కలను తరిమికొట్టి వృద్ధురాలిని రక్షించారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో 108 అంబులెన్స్‌లో మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమెకు మెరుగైన వైద్యం అందిస్తుండగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జనావాసాల్లో వీధికుక్కల బెడద పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

