పల్లెల్లో రహదారులకు కొత్త ఊపిరి
గుడ్లవల్లేరు మండలంలో రూ.1.70 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన… డోకిపర్రు, కౌతవరం, ఎన్టీఆర్ నగర్ కాలనీలో రోడ్ల నిర్మాణం… సంక్షేమంతో పాటు అభివృద్ధికీ సమాన ప్రాధాన్యం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడ్లవల్లేరు, అక్టోబర్ 3: గుడివాడ నియోజకవర్గంలో ‘పల్లె పండగ 3.0’ కింద గ్రామీణ రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. గుడ్లవల్లేరు మండలంలోని మూడు ప్రాంతాల్లో రూ.1.70 కోట్లతో చేపట్టనున్న రోడ్ల నిర్మాణ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. డోకిపర్రు గ్రామంలో రూ.65 లక్షలు, కౌతవరం గ్రామంలో రూ.30 లక్షలు, గుడ్లవల్లేరు ఎన్టీఆర్ నగర్ కాలనీలో రూ.75 లక్షలతో నిర్మించనున్న రహదారులకు కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించారు. ఏళ్లుగా ఎదుర్కొంటున్న రహదారి సమస్యలకు పరిష్కారం లభిస్తుండటంపై ఆయా ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే రాముతో పాటు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ‘పల్లె పండగ 3.0’

ద్వారా పెద్దఎత్తున రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. సరైన రహదారి సౌకర్యాలు లేని గ్రామాలను గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయిస్తున్నామన్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను దశలవారీగా మెరుగుపరుస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు బలోపేతమైతే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు వ్యవసాయం, వ్యాపారం, రవాణా రంగాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కార్యక్రమాల్లో ఏపీ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడ్లవల్లేరు మండల పార్టీ అధ్యక్షుడు పోలవరపు వెంకటరావు, మార్కెట్ యార్డు ఛైర్మన్ పొట్లూరి రవి, కూటమి నాయకులు, పంచాయతీరాజ్ అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

