సరస్వతీదేవికి పట్టు వస్త్రాల సమర్పణ
భీమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, రావి… సామూహిక అక్షరాభ్యాసంలో చిన్నారులతో అక్షరాలు దిద్దించిన ఎమ్మెల్యే… విద్యలో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్ష…

గుడివాడ, అక్టోబర్ 16: మూలా నక్షత్రం పర్వదినాన గుడివాడ బంటుమిల్లి రోడ్డులోని శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, రావి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ మండపంలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొని చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. ఆలయానికి విచ్చేసిన వారికి దేవాదాయ శాఖ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి సమర్పించే పట్టు వస్త్రాలను శిరస్సుపై ఉంచుకుని ఎమ్మెల్యే రాము ఆలయ ప్రదక్షిణలు చేశారు. స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అక్షరాభ్యాస కార్యక్రమంలో చిన్నారులను ఒడిలో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దించారు. విద్యారంభం చేసిన చిన్నారులను ఆశీర్వదించి పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. వేదపండితులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ.. సరస్వతీదేవి ఆరాధనకు విశిష్టమైన మూలా నక్షత్రం రోజున సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. చిన్నారులంతా అమ్మవారి కృపతో విద్యలో రాణించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. ఉన్నత స్థానాలకు ఎదిగి గుడివాడకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అమ్మవారి చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల కమిటీ చైర్మన్ పట్టపు చిన్న, ఈవో కందుల గోపాలరావు, వేదపండితులు భైరవబొట్ల విజయకుమార్ శర్మ, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహనరావు, దేవరపల్లి కోటి, గడ్డం ప్రకాష్‌దాస్, పొట్లూరి కృష్ణారావు, ఆలయ ధర్మకర్తల కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

