కూటమి విజయంపై కేబినెట్‌లో హర్షాతిరేకాలు!
కరచాలనం చేసుకుంటూ సమావేశానికి వెళ్లిన చంద్రబాబు, పవన్ కల్యాణ్… ఇద్దరు నేతలకు అభినందనలు తెలిపిన సహచర మంత్రులు… చప్పట్లతో మార్మోగిన మంత్రివర్గ సమావేశ ప్రాంగణం…

అమరావతి, నవంబర్ 10 : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సాధించిన విజయంపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో హర్షం వ్యక్తమైంది. మంగళవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఎన్నికల ఫలితాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరస్పరం కరచాలనం చేసుకుంటూ కేబినెట్ సమావేశానికి వెళ్లారు. 'హిట్ కొట్టాం' అంటూ ఇద్దరు నేతలు ఆనందాన్ని పంచుకున్నట్లు అందిన సమాచారం. కేబినెట్ హాల్‌లోకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రవేశించగానే సహచర మంత్రులు వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేయడంతో సమావేశ ప్రాంగణం సందడిగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంత్రివర్గ సభ్యులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగింది.

