స్వయం ఉపాధితోనే మహిళా సాధికారత
కాస్ట్యూమ్ జ్యువెలరీ శిక్షణ పొందిన మహిళలకు ధ్రువపత్రాలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై అవగాహన టీడీపీ నేత నగేష్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే సౌమ్య

నందిగామ, సెప్టెంబర్ 4 (ఆంధ్రప్రభ): మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. గురువారం నందిగామ పట్టణంతోపాటు అనాసాగరం గ్రామంలో ఆమె విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనాసాగరంలో కాస్ట్యూమ్ జ్యువెలరీ తయారీలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఎమ్మెల్యే ధ్రువపత్రాలు అందజేశారు. తక్కువ పెట్టుబడితో ఇంటి వద్దే ఆభరణాల తయారీ చేపట్టి ఆదాయం పొందవచ్చని సూచించారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా మహిళలను ఆర్థికంగా స్వావలంబన సాధించేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం కూటమి నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లిన సౌమ్య, ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల అవసరాలు, ప్రాధాన్యత ఆధారంగా అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. నందిగామ పాత బైపాస్ రోడ్డులో అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న టీడీపీ నాయకుడు వడ్డెల్లి నగేష్‌ను ఆయన నివాసంలో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.

