దివ్యాంగుల సేవలో ‘స్పందన’ కృషి ఆదర్శం
మానసిక దివ్యాంగులకు ఉచిత విద్య, వైద్యం, రవాణా, భోజన సదుపాయాలు అభినందనీయం… సమాజానికి నా సహచరుడు వెంకట్ చేస్తున్న సేవలు గర్వకారణం… భవిష్యత్తులో స్పందన కేంద్రానికి నా వంతు సహకారం అందిస్తా: చోడవరపు విజయకుమార్…

గన్నవరం, అక్టోబర్ 3: గన్నవరం మండలం దావాజిగూడెంలో హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పందన మానవ వికాస కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, క్యాట్ న్యాయవాది చోడవరపు విజయకుమార్ శనివారం సందర్శించారు. కేంద్రంలో మానసిక దివ్యాంగులకు అందిస్తున్న విద్య, వైద్యం, రవాణా, భోజన సదుపాయాలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ చైర్మన్ సంకాబత్తుల వెంకట్ తన సహాధ్యాయి అని తెలిపారు. తన మిత్రుడు సమాజానికి అందిస్తున్న సేవలను చూసి ఎంతో గర్వపడుతున్నానన్నారు. గన్నవరం ప్రాంతంలో మానసిక దివ్యాంగుల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అన్ని సేవలను ఉచితంగా అందించడం గొప్ప విషయమని కొనియాడారు. సమాజంలో ఎవరికైనా కష్టం ఎదురైతే ముందుగా స్పందించే వ్యక్తిగా వెంకట్ గుర్తింపు పొందారని పేర్కొన్నారు. నిస్వార్థ సేవా దృక్పథంతో ఎంతోమందికి అండగా నిలుస్తూ ఆదర్శంగా మారారన్నారు. స్పందన మానవ వికాస కేంద్రం ద్వారా దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమానికి చేస్తున్న కృషి ప్రశంసనీయమని చెప్పారు. భవిష్యత్తులో కేంద్రానికి తనవంతు సహకారం అందిస్తానని విజయకుమార్ హామీ ఇచ్చారు.

