గొడ్డలి పార్టీ అధినేత సమాధానం చెప్పాలి
వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చాయి… రూ.40 కోట్ల సుపారీ వెనుక అంతిమ లబ్ధిదారులెవరో తేలిపోయింది… మద్యం కుంభకోణంలోనూ వేలకోట్ల దోపిడీకి సమాధానం చెప్పాలని చంద్రబాబు సవాల్…

ప్రొద్దుటూరు, అక్టోబర్ 5: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలన్నీ బయటకు వచ్చాయని, రూ.40 కోట్ల సుపారీ వెనుక ఉన్న అంతిమ లబ్ధిదారులెవరో ప్రజలకు తెలిసిపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో ఆ నిందను తనపై మోపేందుకు ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. సొంత పత్రికలో ‘నారాసుర రక్తచరిత్ర’ పేరుతో కథనాలు రాశారని గుర్తుచేశారు. నిజం నిప్పులాంటిదని, నిప్పుతో చెలగాటమాడితే ఎప్పటికైనా భంగపాటు తప్పదని వ్యాఖ్యానించారు. మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించిన చంద్రబాబు, ఆ వ్యవహారంలోని అంతిమ లబ్ధిదారుడి వైపే ఆధారాలు చూపుతున్నాయన్నారు. వివేకా హత్య కేసు, మద్యం కుంభకోణంపై ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా అంటూ వైఎస్సార్‌సీపీ అధినేతకు చంద్రబాబు సవాల్ విసిరారు.

