బుడమేరు వరద ప్రవాహాన్ని పరిశీలిస్తున్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
పుట్టగుంట వంతెనపై ప్రమాదకరంగా వరద ప్రవాహం వెయ్యి ఎకరాల పంట పొలాలకు ముంపు ముప్పు గుర్రపుడెక్క తొలగింపునకు మూడు ప్రోక్లైనర్లతో పనులు



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
నందివాడ, సెప్టెంబర్ 25: కృష్ణా జిల్లా నందివాడ మండలంలో బుడమేరు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు చేరుతుండటంతో పుట్టగుంట వంతెన వద్ద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుక్రవారం అధికారులతో కలిసి వరద పరిస్థితిని పరిశీలించారు. వరద నీటితోపాటు భారీగా కొట్టుకొస్తున్న గుర్రపుడెక్క వంతెన వద్ద పేరుకుపోయి ప్రవాహానికి అడ్డంకిగా మారింది. దీంతో మూడు ప్రోక్లైనర్ల సహాయంతో గుర్రపుడెక్కను తొలగిస్తున్నారు. వరద నీరు ఎలాంటి ఆటంకం లేకుండా కొల్లేరులోకి వెళ్లేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అనంతరం రైతులతో కలిసి ద్విచక్ర వాహనం, ట్రాక్టర్‌పై పెద్దలింగాల, చిన్నలింగాల, చేదుర్తిపాడు, ఒద్దులమేరక గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. నీటమునిగిన పంట పొలాలతోపాటు ఆత్కూరు డ్రైనులో


ప్రవాహాన్ని పరిశీలించారు. సుమారు వెయ్యి ఎకరాల పంట పొలాలు ముంపు ముప్పును ఎదుర్కొంటున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బుడమేరు వరద నీరు వంతెనపై నుంచి ప్రవహిస్తుండటంతో గుడివాడ–హనుమాన్ జంక్షన్ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసుల పర్యవేక్షణలో రాకపోకలను నియంత్రిస్తున్నారు. గతంలో ఎదురైన వరద తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగాన్ని ముందుగానే అప్రమత్తం చేసినట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడం కొంత ఊరటనిస్తున్నప్పటికీ ఎగువ నుంచి వరద నీరు చేరుతున్నందున అప్రమత్తత కొనసాగించాలన్నారు. సాయంత్రానికి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని, శనివారం నాటికి పరిస్థితి అదుపులోకి రావచ్చని పేర్కొన్నారు. పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
