వైద్యానికి సుజనా భరోసా
ముగ్గురు బాధితులకు రూ.23.22 లక్షల ఎల్‌ఓసీలు భవానీపురం ఎన్డీయే కార్యాలయంలో పత్రాల అందజేత ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధిత కుటుంబాల కృతజ్ఞతలు

విజయవాడ, సెప్టెంబరు 4: నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కృషితో ముగ్గురు బాధితులకు రూ.23.22 లక్షల విలువైన ఎల్‌ఓసీలు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆయన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి భవానీపురంలోని ఎన్డీయే కార్యాలయంలో బాధిత కుటుంబాలకు ఎల్‌ఓసీ పత్రాలను అందజేశారు. 48వ డివిజన్ వాగు సెంటర్‌కు చెందిన పరుచూరు రామచంద్రరావు క్యాన్సర్‌తో బాధపడుతూ వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకోగా రూ.10.72 లక్షల ఎల్‌ఓసీ మంజూరైంది. 47వ డివిజన్‌కు చెందిన యళ్లపిల్ల అమరేశ్వరి (55) హృద్రోగ చికిత్స కోసం దరఖాస్తు చేసుకోగా రూ.7.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేశారు. 40వ డివిజన్‌కు చెందిన కామంచి సాయిచంద్ర మహీధర్ (14) మోకాలి శస్త్రచికిత్స నిమిత్తం రూ.5 లక్షల ఎల్‌ఓసీని అందజేశారు. తమ విజ్ఞప్తులపై త్వరితగతిన స్పందించి వైద్య సహాయం అందేలా కృషిచేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నేతలు నాగోతి రామారావు, పోతినీడి లోకేష్, వేవిన నాగరాజు, దేవిన హరిప్రసాద్, భావిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

