వాన బాధితులకు తక్షణ సాయం
చింతపాడులో కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే కొలికపూడి పర్యటన ధ్వంసమైన ఇళ్ల పరిశీలన.. బాధిత కుటుంబాలకు భరోసా వైద్య శిబిరాల పెంపు.. అంటువ్యాధుల నివారణకు ఆదేశాలు

తిరువూరు, సెప్టెంబర్ 24: వర్షాలు, గాలివాన కారణంగా నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో కలిసి గురువారం తిరువూరు మండలం చింతపాడులో ఆయన విస్తృతంగా పర్యటించారు. గాలివానకు ధ్వంసమైన ఇళ్లను పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. అనంతరం పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితులకు అందుతున్న వసతి, ఆహారం, తాగునీరు తదితర సౌకర్యాలను పరిశీలించారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. వర్షాల అనంతరం అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందికి కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. స్వర్ణ గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను పరిశీలించిన ఆయన అవసరాన్ని బట్టి శిబిరాల సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించారు.
